Saturday 14 February 2015

Farewell Note !


‘అనురాగ – అనుబంధాల’ గాథ ... “అనురాధ” !!


అనురాగం - అభిమానం కలగలిపి
ఆనందం - ఆప్యాయతలు మాకు తెలిపి
ప్రేమకు పర్యాయంలా, గౌరవం గర్వపడేలా,
అసూయలేని, కోపం రాని,
ఇష్టాన్ని వీడక, మంచిని మరవక ,
బంధాలకు బానిసై  అనుబంధాల 
ఒడిలో  వెలసిన  రాధే
‘అనురాధై’ వచ్చారు.

వ్యక్తిగతంగా ఆదరించి ,
వృ త్తి పరంగా ప్రోత్సహించి
మా పొరపాట్లను సైతం మీవిగా భరించి,
మాతో సాగిన మీ సహచరణ,
మా కై  చేసిన మీ కార్యచరణ.
ఓర్పు , సహనం  మీ పలు గుణాలు ,
మాకు నేర్పాయి ఎన్నో పాఠాలు.
క్షమా గుణంతో సాగిన మీ విధానాలు ,
మాకు అయ్యాయి  మార్గదర్శకాలు .

ఒక తల్లిగా మీ పిల్లల
పెరుగుదల గురించి ఆలొచిస్తూ ,
ఒక అధికారిగా
ఈ పిల్లల ఎదుగుదల గురించి అన్వేషిస్తూ,
మీ బాధ్యత కు, మీ వృత్తికి సమన్యాయం చేసి
మీకు మీరే సాటి అని అనిపించుకున్నారు

మీ పిల్లలపై మీరు పెట్టుకున్న ఆశలు
ఆ దేవుని ఆశీస్సులతో నెరవేరాలని
మీరు  సుఖ – శాంతులతో
ఆయురారోగ్యాలతో
నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని

ఆశిస్తూ... 
ఇదే ..
మీకు మా వీడుకోలు !!



Saturday 7 February 2015

ఆశ - ఆశయం


మనిషి జీవితంలో
"ఆశ - ఆశయం" అనేవి
'బొమ్మ-బొరుసు' లా దోబూచులాడుతూ
'కష్ట-సుఖాలు' గా కలిసి వుంటాయి

కొందరు అన్ని తమకే కావాలనే
ఆశ తో ఆరాటపడుతుంటే 
ఇంకొందరు తమకే సాధ్యమయ్యే
ఆశయం కోసం జీవిస్తుంటారు.

ఆశయం కోసం ఆశను
చంపుకునే వాడు
తన ఆశయాల్ని త్వరగా చేరుకొని
ఆపై  ఆశల్ని ఆస్వాదిస్తాడు.

ఆశయము ను మరచి
ఆశల పల్లకిలో
కనిపించని ఊహలతో
కనిపెంచిన వాళ్ళను మరచి
కనిపించే తారలతో
నింగిలోని తారలను చుస్తూ
నేలపై నున్న మనుషులను
మరచి పోతాడు.

చివరికి...
తప్పు తెలిసి,
అన్ని మరచి,
ఆశయం గుర్తొచ్చి
తిరిగి చూస్తే,
ఏముంటుంది ?
కోల్పోయిన కాలం,
గడిచిన క్షణాలు తప్ప !

అందుకే..

ఆశయాన్ని మరువకు నేస్తం
ఆశలు ఎన్నున్నా
ఆపదలు ఎన్ని ఎదురైనా !!



అవకాశం అందివచ్చిన వేళ.. నా మనసుతో నేను.!!

అవకాశం కోసం ఆకాశం వైపు చూసే ఈరోజుల్లో
అవకాశం అంది వచ్చిన వేళ.. నాతో నేను!

ఆశయ సాధనలో - కఠోర దీక్ష తో
లక్ష్య చేధనలో - కఠిన శ్రమతో
అవకాశాల శోధనలో
విసుగు చెందక
అవరోధాల పరిశోధనలో 
విరక్తి పొందక

మది నిండిన వేదనతో 
విమర్శలను లెక్క చేయక
కనులెండిన రోదనతో 
విలువలను వీడక

భవిష్యత్ పై భయంతో 
ఎన్నో లోటుపాట్లకు లోనై
భగవంతుని అభయంతో  
ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని

సన్నిహితుల సహకారంతో పోటీలో నిలిచి
మిత్రుల ప్రోత్సాహంతో మేటిగా గెలిచి

నీకంటూ ఓ అవకాశం అందివచ్చిన వేళ
నిర్ణయం తీసుకోవడానికి నిరీక్షించి
బంధాల బాధ్యతల గురించి ఆలోచించి
వృత్తి ధర్మాన్ని పాటిస్తూ
ఉన్న ఉద్యోగాన్ని  వదలలేక

ఇష్ట ధర్మాన్ని ప్రేమిస్తూ
పొందిన అవకాశాన్ని వదులుకోలేక
పరిస్థితులకు తలొంచి
బంధాలకు బందీయై
వృత్తి అనే వృత్తం లో తిరుగుతూ
మాట మూగబోయింది
ఆశయం ముంగిట ఆగిపోయింది.

అయితేనేం..
ఈ అవకాశం నీకొక ఆశయమై
అనుభూతిగా మిగిలి, విజయానికి
మైలు రాయిగా మారింది.

అందుకే….
విచారించి, విలపించక
పట్టు సడలించి, ప్రయత్నాన్ని వీడక
ఆశయానికి చేరువైన ఆనందంలో
కొత్తగా ఆలోచించి ,ఆశయ సాధనకై
తగిన సమయాన్ని కేటాయించు
అంతులేని విజయాన్ని ఆహ్వానించు ..

                                           --- నాలో నేను